← Back to all posts

నదితో మాటలాడాలి

నదితో మాటలాడాలి

కాసేపు ప్రశాంతంగా
నదితో మాట్లాడాలి.
నడక ఎలా నడవాలో నేర్పమని
బతిమాలుకోవాలి.

బాధలను ఎలా నమిలి మింగాలో
తెలుసుకుంటూనే,
ఓ గాథకు రూపకల్పన ఎలా చేయాలో
చెప్పమనాలి.

అవమానాలు, అపనిందల మీదుగా
ఆగకుండా ఎలా ప్రయాణించాలో
కాస్త నేర్పించమనాలి.

విడిపోయే చోటునుండి
దూరంగా ఎలా జరగాలో,
కలిసే చోటుల్లోకి
ఎలా ప్రవహించాలో తెలుపమనాలి.

మునిగిపోవడానికి కారణమేమిటో,
తేలడానికి ఆధారమేమిటో,
తీరమేమిటో, బతుకుదారమేమిటో
కాస్త ఓపికగా వివరించమనాలి.

ఎలాగైనా, ఎప్పుడైనా
కాస్త తీరిక దొరికినప్పుడల్లా
నదిని పలకరించి రావాలి.

మెత్తటి ఇసుకలా మారైనా సరే,
దాని తాలూకా జీవన రహస్యాలేమిటో
నుదుటిన నాలుగు రేఖలుగానైనా
పూసుకుని రావాలి.

ఈ బ్లాగ్‌లోని రచనలు మీకు నచ్చినట్లయితే, ఈ స్వచ్ఛమైన ప్రయాణం ఇలాగే ముందుకు సాగడానికి మీ వంతు మద్దతు అందించండి.