← Back to all posts

అసూయ కాదు… అది ప్రేమ

మధువన వీధుల్లో
కృష్ణుడి నవ్వు మరో గోపిక వైపు జారితే,
వేణుగానంలో మరో పేరుకు చోటిచ్చితే,
రాధ గుండెలో ప్రేమజ్వాలలు రగలక
ఎలా ఉంటాయి?

గోపికలతో నవ్వినా,
వారితో మాటల పూలు చల్లినా,
కృష్ణుడి హృదయ తోటలో వికసించేది
రాధ పేరే అయినా…

ప్రేమకు తర్కం తెలియదు,
నమ్మకానికీ కొన్నిసార్లు నీడలు ఉంటాయి.
అందుకే రాధ కళ్లలో
అలక మేఘాలు కమ్ముకుంటాయి.

గోపికలు ఆకాశంలోని తారలు అయితే,
రాధ మాత్రం పూర్ణ చంద్రిక.
అయినా చంద్రుడు కూడా
మేఘాలను చూసి కలత చెందుతాడు కదా!

యమునా తీరంలో
కృష్ణుని పెదవులు “రాధా” అని పలికినా,
ఆయన చూపులు ఇంకెవరినో తాకితే,
ఆమె మనసు ఎందుకు మౌనంగా ఉంటుంది?

ప్రేమ అనేది స్వాధీనత కాదు,
కానీ ప్రియుడి చూపు మరొకరి వైపు మళ్లిన క్షణం,
హృదయంలో పడె చిన్న నొప్పే
రాధ అలక.

అందుకే…

కృష్ణుడు అందరివాడైనా,
రాధకు మాత్రం అతడు ఒక్కరే.
ఆ ఒక్కరిని పంచుకోవాల్సి వస్తే,
ఆమె హృదయం మండక
ఎలా ఉంటుంది?

రాధ ఎలా అలకపడదు…
ఆమె ప్రేమే అంత లోతైనప్పుడు!


Inspired by the song “Radha Kaise Na Jale

ఈ బ్లాగ్‌లోని రచనలు మీకు నచ్చినట్లయితే, ఈ స్వచ్ఛమైన ప్రయాణం ఇలాగే ముందుకు సాగడానికి మీ వంతు మద్దతు అందించండి.